దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఈ వాయుగుండం పయనిస్తుందని, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించింది.
ఏపీలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, నైరుతి రుతుపవనాలు నేటితో దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయని, నేటి నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైనట్టు ఐఎండీ అమరావతి పేర్కొంది.