నిన్న ఉదయం నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన వడగళ్ల వాన రైతులకు అపారమైన నష్టాన్ని కలిగించింది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలోని ముథోల్‌లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈరోజు నుండి సోమవారం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.