గురువారం గ్రేటర్ పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది. కాప్రాలో అత్యధికంగా 2.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లిలో 1.80, కుత్బుల్లాపూర్‌లో 1.60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఆరెంజ్ అలర్ట్ (11.56 సెం.మీ నుంచి 20.44 సెం.మీ వర్షం), ఎల్లో అలర్ట్ (6.45 సెం.మీ నుంచి 11.55 సెం.మీ వర్షం) జారీ చేశారు.
మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నిలిచిన నీటిని శుభ్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపటి నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈరోజు భారీ వర్షాల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.