నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బన్సీలాల్ పేటలో అత్యధికంగా 8.75 సెం.మీ, ఖైరతాబాద్‌లో అత్యల్పంగా 6.30 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, రాజ్ భవన్ రోడ్, లక్డీకపూల్, దిల్ సుఖ్ నగర్, ముసారాంబాగ్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో, GHC కంట్రోల్ రూమ్ 040-21111111, 9000113667కు కాల్ చేయాలని సూచించారు.