హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏలో కొత్త జోన్లు ఏర్పాటయ్యాయి. గతంలో నాలుగు జోన్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 6కు చేరుకుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ మండలాలను ఆరుకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్, ఘట్‌కేసర్ జోన్లను యథాతథంగా ఉంచుతామన్నారు. శంకర్ పల్లి, మేడ్చల్ జోన్లను రెండు జోన్లుగా విభజించనున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి 7,200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ మొత్తాన్ని హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతంలో హెచ్‌ఎండీఏలో నాలుగు మండలాలు ఉండగా, నగరవాసులకు సేవలు అందక ఇబ్బందులు ఉండేవి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తాజాగా జోన్ల విభజనతో పాటు అదనపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.