తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్ వద్ద దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఇళ్లకు శేరిలింగంపల్లి తహశీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లోగా సమాధానం చెప్పాలని, ఆపై స్వచ్ఛందంగా కూల్చివేయాలని నిర్మాణాల యజమానులకు నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు.
దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలకు నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉండడం గమనార్హం. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్‌లోని నివాసాలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మొత్తం 204 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.