భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.
మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలను ఈవోఎస్-08 పర్యవేక్షించనుంది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ప్రయాగం విజయంతం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలిపారు.