బలగం సినిమాలోని నల్లిబొక్కల ఫైట్ లాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. అప్పటి వరకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఇంతవరకు బాగానే ఉంది. భోజనంలో మటన్ ముక్కలు లేకపోవడంతో జరిగిన ఘర్షణలో ఇరువర్గాల మధ్య ఎనిమిది మందికి గాయాలైన సంఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలోని బాద్గుణకు చెందిన వ రుడితో వివాహమైంది. పెళ్లి భోజనంలో మటన్, చికెన్ సరిగ్గా పెట్టలేదని వరుడి బంధువులు గొడవకు దిగారు. తక్కువ ముక్కలు పెడుతున్నారంటూ వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. చిన్నగా మొదలైన గొడవ ఒక్కసారిగా పెద్దదైంది. దీంతో వధూవరుల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఫంక్షన్ హాల్ బయట రోడ్డుపై ఇరువర్గాలు దాడికి పాల్పడి గందరగోళం సృష్టించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరువర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.