Nipah virus: కేరళలో నిఫా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా పాలక్కాడ్ జిల్లాలో 58 ఏళ్ల వ్యక్తి నిఫా వైరస్ బారిన పడి మృతి చెందాడు. మృతుడు మన్నర్కాడ్ సమీపంలోని కుమారంపుత్తూర్‌కు చెందినవాడు కాగా, పెరింతల్మన్నలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 13న మరణించాడు. వైద్య పరీక్షల్లో అతనికి నిఫా పాజిటివ్ అని తేలింది. ఇది జిల్లాలో రెండో కేసు కావడంతో అధికారులు అప్రమత్తమై కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 46 మందిని గుర్తించి ఐసోలేషన్ లో ఉంచినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ జిల్లాల్లోని ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు ప్రతిస్పందన బృందాలను వేగంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.
రెండో నిఫా కేసు వెలుగులోకి రావడంతో ప్రజలకు జాగ్రత్తలపై మంత్రి వీణా జార్జ్ సూచనలు చేశారు. ముఖ్యంగా జ్వరం, హై-గ్రేడ్ జ్వరం, ఎన్సెఫాలిటిస్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, వైరస్ బారినపడిన రోగుల వద్దకు కుటుంబ సభ్యులు అధికంగా వెళ్లరాదని హెచ్చరించారు. ప్రతి రోగికి ఒక్క అటెండర్ మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని కోరారు. నిఫా వైరస్ ప్రారంభ లక్షణాల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట ఉంటాయని, కొన్ని సందర్భాల్లో మైకం, నాడీ సంబంధిత సమస్యలు 24-48 గంటల్లో కోమాకు దారితీయవచ్చని తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశాలు, మెదడుపై ప్రభావం చూపుతుందని, తీవ్రమైన సందర్భాల్లో మరణాన్ని కూడా కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Internal Links:
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక..
హిందుస్థాన్ యూనీలీవర్ సీఈవోగా ప్రియా నాయర్..
External Links:
కేరళలో నిఫా వైరస్ విజృంభణ: ఇద్దరి మృతితో ఆరు జిల్లాల్లో హై అలర్ట్