ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో 6 పతకాలు, పారాలింపిక్స్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 29 పథకాలు ఇండియన్ అథ్లెట్స్. కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అథ్లెట్లను తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆదివారం రాత్రి ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
ఇందులో ఒలింపియన్లు, పారాలింపియన్లు ఒకేచోట కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 140 మంది వరకు అథ్లెట్లు ఈ ఈవెంట్‌కు హాజరైనట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. “ఈరోజు చాలా ప్రత్యేకమైన సాయంత్రం. ఒలింపియన్లు మరియు పారాలింపియన్లు అందరూ ఒకే వేదికపై ఉన్నారు. వారి గురించి మనమందరం గర్విస్తున్నాము మరియు వారి పట్ల మనకున్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తున్నాం.”అని నీతా అంబానీ అన్నారు.