తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల రైలు పట్టాలపై నీరు నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇప్పటివరకు 432 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. 139 రైళ్లను దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రైళ్లను రద్దు చేసింది.
దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ కేసముద్రం ట్రాక్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. రేపు (మంగళవారం) సాయంత్రానికి ఈ మార్గంలో ఒక ట్రాక్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మరో ట్రాక్ రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కుమార్ జైన్‌తో పాటు అదనపు పనులను అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.
రద్దయిన ముఖ్యమైన రైళ్ల వివరాలు:
లింగంపల్లి – నర్సాపూర్, నాందేడ్ – విశాఖపట్టణం, కాచిగూడ-మిర్యాలగూడ, చెన్నయ్ సెంట్రల్ – చాప్రా, చెన్నయ్ – న్యూఢిల్లీ, సికింద్రాబాద్ – విజయవాడ, సికింద్రాబాద్ – గుంటూరు, లింగంపల్లి – కాకినాడ, మచిలీపట్నం – బీదర్, బీదర్ – మచిలీపట్నం.