ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం (అక్టోబర్ 21) అర్ధరాత్రి నుంచి మంగళవారం (అక్టోబర్ 22) ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో అనంతపురం శివారు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి నదిలోకి వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది. రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా చిత్రావతి ప్రవహిస్తోంది. కనగానపల్లి చెరువు పొంగిపొర్లడంతో అనంతపురం నగరంలోని సమీప కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. 30 ఏళ్లలో ఇంత పెద్ద వరద రాలేదని స్థానికులు తెలిపారు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. తిండి గింజలు కట్టుకున్న బట్టలు సైతం నీటిపాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రామగిరి – N S గేట్, ముత్తవకుంట్ల-, కనగానపల్లి, తగరకుంట, -కనగానపల్లి, రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు, పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు కాలనీలు మునిగిపోయాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. పెనుకొండ మండలం గట్టూరు జాతీయ రహదారిపై వర్షపు నీరు భారీగా ఉండటంతో, పలు వాహనాలు వరదముప్పులో చిక్కుకున్నాయి. దీంతో కియ ఎస్సై రాజేష్ తన సిబ్బందితో మునిగిన వాహనాలను బయటకు తీశారు.