శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి మాటలకు సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే విమానం గేటు వద్దకు వచ్చింది. అప్పుడు ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని ప్రకటించాడు. ప్రయాణికుడి మాటలతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తున్నారు. తన లగేజీని చూస్తూన్నారు. అయితే ఘటన జరిగినప్పుడు విమానంలో దాదాపు 136 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని ఐసోలేషన్‌కు తరలించి తనిఖీలు చేస్తున్నారు.
శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు, బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమానయాన నిషేధం విధించాలని పౌర విమానయాన శాఖ ఆలోచిస్తోంది. అయితే నిబంధనలలో మార్పులు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.