రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ మొత్తం 10 గేట్లను అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరు నేరుగా నాగార్జునసాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది.
జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం నుంచి వచ్చే వరద నీటితో నాగార్జునసాగర్ కూడా నిండుతోంది. అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను ఎత్తేయడంతో సుందర దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.