కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండగా ఈ సంవత్సరంలో 6వ సారి రేడియల్ క్రెస్టు గేట్లను ఎత్తారు. శ్రీశైలం డ్యామ్ ఒక గేటును 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 1,96,177 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఒక గేటు ద్వారా జలవిద్యుత్ కేంద్రాల నుంచి మొత్తంగా ఔట్ ఫ్లో రూపంలో 95,802 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 215.3263 టీఎంసీలుగా ఉంది. ఇక, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తు్న్నారు అధికారులు. అయితే, ఆ తర్వాత 3 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో ఔట్ ఫ్లో 1,51,860 క్యూసెక్కులకు చేరింది.