హైదరాబాద్: నగరంలో వీధి కుక్కలు రోజురోజుకీ వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్నాయి. ఇప్పటి వరకూ అనేక మంది వీధి కుక్కల బారిన పడినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఎందరో అమాయకులు బలి అవుతున్నారు. ఇటువంటి సంఘటనే తాజాగా జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో చోటుచేసుకుంది. వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. దీంతో వీధికుక్కల దాడిలో మరొక అన్యం పుణ్యం తెలియని అభాగ్యుడు బలయ్యాడు. ఇది అధికారుల నిర్లక్షమే అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని కాలనీ వాసులు తెలిపారు.