మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పేరుతో ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు కండక్టర్ల ప్రవర్తనను ఓ నెటిజన్ బయటపెట్టాడు. దీనిపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో కొందరు కండక్టర్లు తమ జేబులు నింపుకోవడానికి మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని నెటిజన్ ఆరోపించారు. పురుషుల వ‌ద్ద టికెట్ కోసం డ‌బ్బులు తీసుకుని, మ‌హిళ‌ల‌కు ఇచ్చే జీరో టికెట్ ఇస్తున్న‌ట్లు నెటిజ‌న్‌ ఆరోపించారు. అదేంట‌ని అడిగితే పొర‌పాటున ఇచ్చిన‌ట్లు చెప్పి, ఆ టికెట్‌ను చించివేసి ఇంకో టికెట్ ఇస్తున్నార‌ట‌. దీనికి స్వ‌యంగా త‌న‌కు జ‌రిగిన అనుభ‌వాన్ని నెటిజ‌న్ ఉదాహ‌రించ‌డం గ‌మ‌నార్హం.

జూన్ 26, జులై 7, ఆగస్టు 4 తేదీల్లో మూడుసార్లు అతని వద్ద డబ్బులు తీసుకుని మహాలక్ష్మి పథకానికి సంబంధించిన జీరో టికెట్ ఇచ్చిన‌ట్లు వాటి తాలూకు ఫొటోల‌ను ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న షేర్ చేశారు. ఇది లూటీ వ్య‌వ‌హారం అని, దీనిపై దృష్టిసారించాలంటూ ఎండీ స‌జ్జనార్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన స‌జ్జ‌నార్ ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అలాగే ప్ర‌యాణికుడికి కలిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో మ‌హాల‌క్ష్మీ జీరో టికెట్ల‌పై ఆర్‌టీసీ ఉన్న‌తాధికారులు దృష్టిసారించాల్సిన అవ‌స‌ర‌ముందంటూ నెటిజ‌న్లు చెబుతున్నారు. ఈ మోసాల‌ను ప్రారంభంలోనే నిలువ‌రించాల‌ని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *