భారీ వర్షాల నేపథ్యంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విద్యా శాఖ ఆదివారమే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈరోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ఉంటే ఆ రోడ్లపైకి వాహనాలను అనుమతించడం లేదన్నారు. హైవేలపై నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలన్నారు.