కవలలుగా పుట్టి భూమి మీదికి వచ్చారు. కవలలుగా కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలం మద్దులపల్లి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరం 59వ డివిజన్ దానవాయిగూడెం కాలనీకి చెందిన అత్తులూరి నరసింహారావు, రమ దంపతులకు నవీన్ (22), మహేశ్ (22) కవలలు ఉన్నారు. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నవీన్, మహేశ్ డిగ్రీ పూర్తి చేసి పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఖమ్మంలోని ఓ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. కాగా, నవీన్, మహేశ్‌తో పాటు వారి స్నేహితుడు సుజాతనగర్‌కి చెందిన పవన్‌ను తీసుకొని ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై కూసుమంచి మండలంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు.
మార్గమధ్యలో మద్దులపల్లి వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ట్రాలీ ఆటో వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొీట్టింది. దాంతో నవీన్, మహేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. పవన్‌కి తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని సీఐ రాజు, ఎస్‌ఐ రామారావు సందర్శించి పరిశీలించారు. మృతదేహాలను అన్నం శ్రీనివాసరావు సహకారంతో పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.