తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుందీ. వివరాల్లోకి వెళ్తే రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు నావంద్గి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటి అవతలివైపు ఉన్న ప్లాట్ ఫాం పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ట్రాక్ దాటే సమయంలో గూడ్స్ ట్రైన్ నెమ్మదిగా వస్తుండడం చూసి హడావుడిగా దాటుతున్నారు. ఓ మహిళ పట్టాలు దాటగా మరో మహిళ మాత్రం పట్టాల మధ్యలో చిక్కిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పట్టాలపై పడుకుండిపోయింది. దీంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపైన అతుక్కుపోయినట్లు కదలకుండా ఉండి తన ప్రాణాలను కాపాడుకోగల్గింది. మధ్యలో ఒకసారి తల ఎత్తి చూసేందుకు ప్రయత్నించగా కెమెరాలో అదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి హెచ్చరించడం వీడియోలో వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.