తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండంగా, మరోవైపు విష వ్యాధులు విజృంభిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చలి వాతావరణం నెలకొంది. వర్షాలు పడుతుండటం వల్లనే చలి వాతావరణం అనుకున్నప్పటికీ, స్వైన్ ఫ్లూ కేసులు బయటపడటంతో వైద్య శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నాలగు కేసులు బయటపడినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
మాదాపూర్ లో నివాసం ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు తీవ్ర దగ్గు తదితర లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, వారు అనుమానించి అక్కడ పరిక్షించింది నారాయణగూడ ఐపీఎంకు నమూనాలను పంపించారు. అయితే ఈ లక్షణాలను స్వైన్ ఫ్లూగా ఐపీఎం నిర్ధారించింది. టోకిచౌకికి చెందిన ఓ వృద్దుడికి, నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన ఓ వ్యక్తికి, హైదర్ నగర్ డివిజన్ లోని మహిళలకు స్వైన్ ఫ్లూ సోకినట్లు తేల్చింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన ఝార్ఖండ్ వృద్దురాలికి కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలిపింది. అయితే స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు బయటకు వెళితే రద్దీ ఉన్న చోట మాస్క్ లు ధరించడంతో పాటు శుభ్రంగా చేతులు కడుక్కోవడంతో పాటు భౌతిక దూరం పాటించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.