భారత ప్రభుత్వం ఇటీవల సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం విదితమే. ఈ అవార్డుపై బాలకృష్ణ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369 చిత్రం ఏప్రిల్ 4న పునః విడుదల కానున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ ప్రసంగించారు. సినీ పరిశ్రమలో నటుడిగా, రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఓటీటీ వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా సేవలు అందిస్తున్న బాలకృష్ణ ఈ సందర్భంగా అనేక విషయాలను వివరించారు. పద్మభూషణ్ అవార్డు ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అంటున్నారు, కానీ అది సరైన సమయంలో వచ్చింది అని అన్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తున్నానని ఆయన అన్నారు. ఆదిత్య 369 లాంటి సినిమాను రూపొందించాలని చాలామంది ప్రయత్నించారని, కొన్ని ప్రారంభించకుండానే ఆగిపోయాయని తెలిపారు. మరికొన్ని ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి చిత్రాన్ని అందించగలిగామని ఆయన అన్నారు.