తాను పేదరికం నుంచి వచ్చానని, ఎన్నో సమస్యలు, అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ స్థాయికి చేరానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన ‘స్ప్రింగ్ స్ప్రీ 2025’ సాంస్కృతిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ వంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
తాను అధ్యాపకుడిగా పనిచేసినప్పటికీ, తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచనతో సినిమాల్లో ఒక్కో అడుగు వేస్తూ ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన ఉంటే సాధించవచ్చని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లైఫ్ ఈజ్ ఏ గేమ్.. వి షుడ్ హావ్ టు ప్లే అంటూ విద్యార్ధులను ఉత్సాహపరిచారు. మంచి ఆరోగ్యంతో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని బ్రహ్మానందం పేర్కొన్నారు.