మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినీ చరిత్రలో ఒక అపురూపమైన నటుడు అని గుర్తిస్తూ ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సముచిత స్థానం కల్పించింది. మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు మెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది. నిన్న హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖులు, మెగా కుటుంబ సభ్యులు, ఇతర రంగాలకు చెందినవారు హాజరయ్యారు.
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధులు మెగాస్టార్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్‌ను అందజేశారు. నటన కంటే డ్యాన్స్‌పై నాకున్న ఇష్టమే గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కడానికి కారణం అనుకుంటానని అన్నారు. డ్యాన్స్ అనేది తనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్‌లకు క్రేజ్ వచ్చిందన్నారు. డ్యాన్స్‌కు అవార్డ్ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ విజయంలో నా దర్శకనిర్మాతలు అభిమానుల పాత్ర మరువలేనిది అని వివరించారు.