రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి-2 గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మొదటి పార్టు భారీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్టు మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండటం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. సెకండ్ పార్టు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దానిపై నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం తెల్లవారు జామున నాగ్ అశ్విన్, ప్రియాంకదత్ దంపతులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత కుటుంబంతో దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
‘కల్కి సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. అందులోని పాత్రలపై ఇంకా స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. సుమతి, అశ్వత్థామ పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నాం. ఆ పాత్రలను మరింత ఎంగేజ్ చేయబోతున్నాం. స్క్రిప్టు వర్క్ జరిగిన దాన్ని బట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వీలైనంత వరకు ఈ ఏడాది చివరలో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మొదటి పార్టులో కర్ణుడి పాత్రను ఎక్కువ చేసి చూపించడంపై కొంత విమర్శలు వచ్చాయి. దాంతో నాగ్ అశ్విన్ ఆ సినిమాలోని పాత్రలపై మరింత దృష్టి పెట్టినట్టు సమాచారం.