Kota Srinivasa Rao: విలక్షణ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు (83) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఫిలింనగర్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్ద మనుమడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కోట శ్రీనివాసరావుకు సినీ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
1942 జూలై 10న ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు, 1968లో రుక్మిణితో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి 750కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో తనదైన నటనతో పేరు పొందారు. తొమ్మిది నంది అవార్డులు పొందిన ఆయనకు 2015లో పద్మశ్రీ లభించింది. 1999–2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కిషన్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు చిరంజీవి ఆయనతో తమ నట ప్రస్థానం ‘ప్రాణం ఖరీదు’తో మొదలైందని గుర్తు చేస్తూ కోట మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.
Internal Links:
కోల్‌కతాలో ఐఐఎం విద్యార్థినిపై అత్యాచారం..
External Links:
కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు..