News5am, Latest Telugu News ( 03/05/2025) : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా రూపొందుతోంది అన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సమయంలో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి ఒక పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై గత కొంతకాలంగా పలురకాల చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్‌లను తీసుకునే ప్రయత్నాలు కూడా జరిగినప్పటికీ, చివరికి నయనతారను ఫైనల్ చేయాలని చిత్రబృందం నిర్ణయించిందని సమాచారం.
అనిల్ రావిపూడి నయనతారను సినిమాలోకి తీసుకురావాలని నిర్ణయించగా, చిరంజీవి కూడా ఆ ఆలోచనకు అంగీకారం తెలిపారు. ఇప్పటికే చిరంజీవి, నయనతార కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ మరియు ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో నటించారు. ఈ సినిమా కోసం నయనతార 18 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు కూడా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారు, ఎందుకంటే నయనతారకు తెలుగు సహా ఇతర భాషల్లో బలమైన మార్కెట్ ఉంది. ఈ సినిమాను మల్టీ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొంత చర్చల అనంతరం ఆమెను ఫైనల్ చేయాలని భావించి, షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా Shine Screens బ్యానర్‌పై సాహూ గారపాటి, మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల నిర్మిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.