మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఎ) అవార్డ్స్ 2024 వేడుకల్లో చిరు ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, యువ హీరోలు దగ్గుబాటి రానా, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి రానా, బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే బాలయ్యకు ‘గోల్డెన్ లెగసీ’ అవార్డు దక్కింది. ఇక హీరోయిన్ సమంత ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. నానికి ఉత్తమ నటుడు అవార్డు దక్కగా, ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం వరించింది. ఇక ఇటీవలే చిరంజీవి ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 46 ఏళ్ల తన సినీ జీవితంలో 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు చిరు ఈ రికార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024లో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకోవడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.