తెలుగు సినిమాకు అత్యంత ముఖ్యమైన సీజన్ సంక్రాంతి. ప్రతి హీరో తమ సినిమాలు సంక్రాంతి రేసులో వుండటానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీ గట్టిగానే ఉంటుంది. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రేసులో వుంది. జనవరి 10న సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంభర సంక్రాంతి రేసులో వుండటం లేదని వార్తలు వస్తున్నాయి.
సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్‌లో వుండటంతో పాటు విశ్వంభర ఓటీటీ డీల్ కూడా ఇంకా పూర్తికాకపోవడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనే ఆలోచనలో వున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కునాల్‌కపూర్, రమ్య పసుపులేటి ఈష చావ్లా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విశ్వంభరకు స్వరాలు అందిస్తున్నారు.