గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ఖమ్మం, విజయవాడ నగరాలను వరదలు ముంచేత్తాయి. భారీ వరదలకు మున్నేరు నది ఖమ్మంపై , బుడమేరు వాగు విజయవాడపై విరుచుకపడ్డాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు. తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇదే సమయంలో వరద బాధితులకు సాయం అందించేందుకు ఎందరో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
టాలీవుడ్ చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. అలానే తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్స్ కి ఒక కోటి రూపాయల చొప్పున రెండు రాష్ట్రాలకు రెండు కోట్లు విరాళం ప్రకటించారు. అలానే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ప్రభాస్ ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. అలానే తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.