పాన్ ఇండియా స్టార్ అంటే ముందుగా గుర్తుగా వచ్చేది రెబెల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో భారీ 1100 కోట్ల హిట్ కొట్టి బోలెడన్ని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ప్రభాస్ స్పీడు మామూలుగా లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ సీక్వెల్‌లో నటిస్తోన్న ప్రభాస్ తాజాగా మరో మూవీని మొదలుపెట్టాడు. రెబల్ స్టార్ ప్రభాస్, ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న కొత్త మూవీ శనివారం పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో డార్లింగ్ ప్రభాస్‌తో పాటు డైరెక్టర్ హనూ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇతర సినీ ప్రముఖులు సందడి చేశారు.
ఈ పూజ కార్యక్రమంలో ప్రభాస్ న్యూ లుక్ తో అభిమానులకు దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి . కాగా, ఈ సినిమా ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు 24 నుంచి మొదలు కానుందని పలు వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ప్రభాస్ చిత్రాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సలార్ పార్ట్-1, కల్కి 2898 ఏడీ లతో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మారుతి సినిమా రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, సలార్: శౌర్యంగ పర్వం, కల్కి పార్ట్-2 వంటి చిత్రాలు ఉన్నాయ్ . ఇప్పుడు ఫౌజీని కూడా లైన్‌లో పెట్టాడు. రాజాసాబ్‌తో పాటు ఫౌజీ కూడా త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. వీటిలో రాజాసాబ్ 2025 ఏప్రిల్‌లో విడుదల కానుంది.