ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ధనుష్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్న రాయన్ జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘రాయన్’ ధనుష్ కెరీర్‌లో 50వ సినిమా. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.
కాగా, ఈ సినిమా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం సభ్యులు ఈ చిత్రానికి చిన్న చిన్న కట్స్ తో “A” సర్టిఫికేట్ జారీ చేసారు. రాయన్ లో హింసను సూచించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, రక్తం, గొడవలు వంటి సన్నివేశాలు చాలా ఉన్నాయని, కొన్నింటిని తొలగించాలని సూచించినట్లు సమాచారం. కాగా A సర్టిఫికెట్ పొందిన కారణంగా 18లోపు వయసు గల వారికి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం నిషేధం. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, ఫైనల్ కాపీని చూసిన సెన్సార్ బృందం సభ్యులు, రాయన్ యూనిట్‌ను అభినందించారు మరియు ధనుష్ దర్శకత్వ ప్రతిభను అభినందించారు. ఈ చిత్రంలో ధనుష్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వం వహించిన తొలి రాయన్ చిత్రాన్ని సన్ పిక్టర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.