శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ మూవీ ‘లవ్ సితార’. వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. కేరళలోని పచ్చని అందాల మధ్య సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. స్వతంత్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్ తారగా శోభిత కనిపించింది. మలయాళీ అయిన ఆమె ఓ పంజాబీ చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ) తో ప్రేమలో పడుతుంది.
ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో కేరళలోని స్వగ్రామానికి వెళ్తారు. అక్కడ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, భావోద్వేగాలను ఎలివేట్ చేస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఈ జంట ప్రేమ ప్రయాణం ఏమైంది అనేది మిగతా కథ. నాగ చైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత నుంచి వస్తున్న సినిమా ఇది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించానని, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని శోభిత అన్నారు. సెప్టెంబర్ 27 నుంచి జీ 5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.