టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన తెరంగేట్రం మూవీ ‘రాజావారు రాణిగారు’లో నటించిన తోటి నటి రహస్య గోరక్‌తో ఏడుఅడుగులు వేశాడు. గురువారం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ప్రస్తుతం కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రహస్య గోరక్ ఎంట్రీ, జీలకర్ర బెల్లం, కిరణ్ అబ్బవరం తాళి కడుతున్న వీడియో ఇలా కొన్ని వీడియోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2019లో తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’ షూటింగ్ సమయంలో కిరణ్, రహస్య మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో కొంతకాలం ప్రేమను ఎంజాయ్ చేసిన ఈ జంట. ఈ ఏడాది తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లితో తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. గురువారం వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ పెళ్లి తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.