రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మళ్లీ గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఇస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఆటో డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఐదు హామీలను ఇచ్చింది. తాజాగా మహిళలకు రూ.2,100 ఇస్తామని తెలిపింది. ఈ మొత్తాన్ని నేరుగా మహిళ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి అతిశీతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఒక్కో మహిళకు రూ.1000 ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే కొందరు మహిళలు తన వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా ఈ మొత్తం సరిపోవడం లేదన్నారు. వారి అభ్యర్థన మేరకు పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు రెండింతల కంటే ఎక్కువ పెంచినట్లు తెలిపారు.