ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన తర్వాత మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు చేపడతారని అతిశీ అన్నారు. ఢిల్లీ సీఎంగా ఎంపికైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే కనీసం టిక్కెట్ కూడా దక్కకపోయేదన్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం తనకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని, మంత్రిని, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారని వెల్లడించారు. తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. ఇలాంటి అవకాశం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ పూల మాలలు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారన్నారు.