జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించారు. మరో పౌరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. సైనికాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలపై అధికారులకు సమాచారం అందింది. శివగఢ్-అసర్ బెల్ట్‌లో నలుగురు ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో సైనిక బలగాలు ఆ ఏరియాలో గాలింపు చేపట్టాయి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలను గమనించి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం రాత్రి మొదలైన ఎదురుకాల్పులు బుధవారం ఉదయం వరకు కొనసాగాయి.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే మరణించిన కెప్టెన్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోందని, ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించామని తెలిపారు. అప్పటికే ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. ఆ స్థావరం నుంచి అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇందులో అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్ రైఫిల్ కూడా ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *