ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కరించే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ రోజు నుంచి నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తన కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని నాయకులకు కాదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో నడుచుకోవాలని కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ్టి నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో చంద్రబాబు చిట్ చాట్ చేసారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను చంద్రబాబు స్వీకరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన, గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైద్య సేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తోందని చంద్రబాబు అభినందించారు. ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని, ధైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధుపండిత్ దాస్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదు. మంచి చేసే వారికి ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *