హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం అన్నారు.ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఒక్కో లారీ 32 టన్నుల ఫ్లై యాష్‌ను రవాణా చేయాల్సి ఉండగా 72 టన్నులు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. వే బిల్లుల్లో ఎంత పరిమాణం ఉందో ప్రస్తావించడం లేదని ఆరోపించారు. ఫ్లై యాష్ రవాణా ద్వారా మంత్రి అక్రమంగా రూ. 50 లక్షలు సంపాదిస్తున్నారని, ఈ సొమ్మును పొన్నం ప్రభాకర్ కుమారుడు అనూప్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న సుమారు 13 లారీలను పట్టుకున్నామని, మంత్రి ఒత్తిడికి తలొగ్గి కేవలం రెండు వాహనాలను సీజ్ చేసి రవాణాశాఖ అధికారులు చేతులు దులుపుకున్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు.ఫ్లై యాష్ రవాణా వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అక్రమ రవాణా కారణంగా అఖిల్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై న్యూఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.