రాజమహేంద్రవరం : కొత్త ప్రభుత్వ అవతరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 29 ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఈ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యాలయాలకు లైటింగ్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవి లత తెలిపారు.ప్రజలు ప్రత్యక్షంగా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, మండల కార్యాలయంలో 9 చోట్ల తెరలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు మండల కేంద్రాలు, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్‌లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లో అనువైన కళ్యాణ మండపాలను గుర్తించి అక్కడ తెరలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, ఆర్‌డీఓ కార్యాలయాలు లైటింగ్‌తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి, డివిజనల్ డెవలప్ మెంట్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.