రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్ వే నిర్మించనున్నారు. ఖమ్మం ఖిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా ముజ్జుగూడెంలోని బౌద్ధ స్థూపాన్ని మంత్రి పొంగులేటితో కలిసి పరిశీలించారు.
అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. నెలకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా ఆయా జిల్లాల పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని జూపల్లి సూచించడం విశేషం. ఖమ్మం జిల్లాలో ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు ఉన్న అడవులు ఎకో టూరిజానికి అనుకూలం. నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం నుంచి జమలాపురం మీదుగా భద్రాచలం సీతారాముల దేవాలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఖమ్మం ఖిల్లాపై రోప్ వే నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.