ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు సంబంధించి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు కూటమి ప్రభుత్వం దూరంగా ఉండనుంది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.

జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్‌ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. పోటీ పెడితే గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా అంత ప్రయాస పడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్ధి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దాని వల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని టీడీపీ అధినేత అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *