ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఉచిత బస్సు సదుపాయం కోసం మహిళలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించే అంశంపై ఇప్పటికే అధికారుల బృందం ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారని పలు కథనాలు వినబడుతున్నాయి. అయితే అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే దింతో మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవానికి మరో రోజు నిర్ణయిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అర్టీసీ, రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళల ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. కానీ, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 12న మరోసారి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన అధికారులతో చర్చిస్తారని మంత్రి వెల్లడించారు. మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 12న సమీక్ష అనంతరం ఉచిత బస్సు ప్రయాణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.