ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే జనసేన నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడం, నామినేషన్ దాఖలు చేయడం జరిగిపోయాయి. ఇక, ఆదివారం రోజు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నామినేషన్ వేసేందుకు టీడీపీ అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగయనున్న నేపథ్యంలో, ఈ రోజు తమ అభ్యర్థి సోము వీర్రాజు అంటూ బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
బీజేపీ కేంద్ర పెద్దల వద్ద తన పట్టు సోము వీర్రాజు నిలుపుకుంటూ మరోసారి ఎమ్మెల్సీ కానున్నారు. రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు నాలుగు దశాబ్దాలుగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఏబీవీపీ, యువమోర్చా, విభాగాల్లో పనిచేసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ పెద్దలు ఏ సమీకరణ ఆధారంగా సోమును ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉన్న విషయం విదితమే.