బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో వేలాది మంది అభ్యర్థులు నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఈ చలిలో విద్యార్థులపై నీటి ఫిరంగులు, లాఠీచార్జి చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌లో మూడు రోజుల వ్యవధిలో విద్యార్థులపై ప్రభుత్వం రెండుసార్లు దాడులు చేసిందన్నారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్, పేపర్ లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత తమదేనన్న విషయాన్ని నితీశ్ ప్రభుత్వం మరిచిపోయింది. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ యత్నిస్తుందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.
ఈ సంఘటనను నిరంకుశ ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణగా పేర్కొన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతతో పోలీసులు దారుణంగా ప్రవర్తించడం ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థిగా ఎన్నో ఉద్యమాలు చేసి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నీతీశ్ కుమార్ సర్కార్ నుంచి ఈలాంటివి ఊహించలేదన్నారు.