బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా,హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కన్ను మూసారు. బీఆర్ఎస్ నేత చనిపోయాడని తెలుసుకున్న ఆ పార్టీ నేతలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో బాలకృష్ణా రెడ్డి కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. టికెట్ రాకపోవడంతో 2009లో బీఆర్ఎస్ పార్టీని వీడి.. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. అనంతరం పార్టీని బీజెపీలో విలీనం చేశారు. 2023 అక్టోబర్ 20న తిరిగి సొంత గూటి అయిన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.