బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వాక్యాలు చేశారు. విద్యారంగంలోని సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. విద్యార్థులు లేరంటూ 1864 పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
తద్వారా పేదవారిని విద్యకు దూరం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. పాఠశాలలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని హితవు పలికారు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.