జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఆవిడ పేర్కొన్నారు. ఐఫోన్ స్థిరమైన పనితీరుకు ప్రాధాన్యం కల్పిస్తే, చైనా ఫోన్ బయటకు బాగుంటుందని, కానీ, సరిగ్గా పని చేయదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా మాటలు చెప్పి బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
అలాగే రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతులను కష్టాల్లో నెట్టిందని, ఎండిపోయిన పొలాలను చూస్తుంటే రైతులు కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను కాపాడే తెలివి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హామీలను ప్రస్తావిస్తూ, ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు రూ. 2,500 సహాయం ఏమయ్యాయి? మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని కవిత అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రస్తావిస్తూ, ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీకి జగిత్యాలలో అడ్రస్ ఉండదని ధీమా వ్యక్తం చేశారు.