పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసుపై రాజకీయ వేడి మొదలైంది. రషీద్‌ను హత్య చేసిన జిలానీ మీ పార్టీ వారేనంటూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. జలానీ, రషీద్‌లు వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నారని ఇద్దరి వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారితీశాయి అంటూ దీంతో తమకు ఏమి సంబంధం లేదని టీడీపీ చెబుతోంది. లేదు, లేదు జిలానీని టీడీపీ కార్యకర్త అంటూ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన బెంగళూరు పర్యటన అర్థాంతరంగా ముగించుకుని తాడేపల్లికి రానున్నారు. గత సోమవారం బెంగళూరు వెళ్లిన జగన్.. వినుకొండ ఘటనతో తన యాత్రను మధ్యలోనే ముగించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ ముఖ్యమంత్రి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుంటారు. జగన్ వినుకొండ వెళ్లే అవకాశం ఉందని.. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
వైఎస్సార్సీపీని అణగదొక్కాలనే కోణంలో ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే రాజకీయ కక్షల హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంసాలకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన ఇందుకు పరాకాష్ట. ప్రధాన రహదారిపై జరిగిన ఈ దారుణ ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు. ముఖ్యమంత్రితో సహా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, వారు పోలీసులతో సహా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు విజృంభిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ప్రత్యేక విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై మోదీ దృష్టి సారించాలని నేను ప్రధానమంత్రి గారికి మరియు హోంమంత్రి శ్రీ అమిత్ షాగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడరని హామీ ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.