తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ధ్వజమెత్తారు. రాజలింగం హత్యను దారి మళ్లించేందుకు హరీష్ రావు, కృష్ణా నీటి వివాదం గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ హత్య కేసు వెనక మాజీ సీఎం కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించిన ఆయన, ‘‘అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా? రాజలింగంను హత్య చేయించి, ఇప్పుడు నేరాన్ని దాచేందుకు నీటి వివాదం లేపుతున్నారా?’’ అంటూ మండిపడ్డారు. అలాగే హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ, ‘‘కృష్ణా నదీ నీటి దోపిడీకి అసలు కారణం ఎవరు? వైఎస్ జగన్‌తో దోస్తానా చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు దోచి పెట్టింది నువ్వే కదా?’’ అని ఆయన నిలదీశారు.
రాజలింగం హత్యపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా ఉన్నారని, దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ‘దమ్ముంటే మీరు చేసిన మంచి పనులు చెప్పుకోండి. కేసీఆర్ దోపిడీ ప్రశ్నిస్తే హత్యలు చేయిస్తున్నారు. కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాజలింగం హత్య కేసు మరింత రాజకీయ మలుపు తిరిగే అవకాశముంది. ఈ కేసులో ఏమైనా సంచలన విషయాలు వెలుగు చూస్తాయా? హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనేది సమగ్ర దర్యాప్తులో తేలనుంది.